హైదరాబాద్,అర్జున్ సమాచారం:
సామాజిక న్యాయం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, మంత్రివర్గంలో బీసీలు, మహిళలు, ఎస్సీ/ఎస్టీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని దుయ్యబట్టారు. 56 శాతం ఉన్న బీసీలకు కేవలం ముగ్గురికే, మహిళలకు ఇద్దరికే మంత్రి పదవులు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 6న ‘సామాజిక న్యాయ సంకల్ప సభ’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మేము సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పెట్టిన తర్వాతే ముఖ్యమంత్రి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మా సభ తర్వాత కచ్చితంగా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే అనివార్యత వస్తుందని చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. 31 నెలలుగా మాట్లాడని ముఖ్యమంత్రి మా ఒత్తిడి కారణంగా సామాజిక న్యాయం అనే మాట మాట్లాడుతున్నారు. మేము తీసుకొచ్చిన అనివార్యత కారణంగానే అధికారంలో ఉన్న పార్టీ దిగివచ్చి సామాజిక న్యాయం అంటోంది. కానీ ముఖ్యమంత్రి సామాజిక అన్యాయం అనాల్సింది పోయి సామాజిక న్యాయం అన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన చేసేదే సామాజిక అన్యాయం. కానీ సామాజిక న్యాయం అంటాడని అన్నారు.
నిజంగా సామాజిక న్యాయంపై చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో 16 మంది ఉంటే ముగ్గురు మాత్రమే బీసీలు ఉంటారా? ఏడుగురు మాత్రమే బీసీలు ఉన్నారు. అందరికీ మంత్రి పదవులు సాధ్యమా అంటే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు కదా? వాళ్లలో మీకు ఎవరు కూడా అర్హత ఉన్నవాళ్లలాగ కనిపించలేదా? ఇద్దరు ఆడబిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చామని చెబుతున్నారు. అది 33 శాతం అవుతుందా? తెలంగాణ ఉద్యమకారురాలు విజయశాంతి ని ఎమ్మెల్సీ చేసి సైలెంట్ చేశారు. ఆమెకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? అందుకే ఈ ముఖ్యమంత్రి సామాజిక న్యాయం అంటే మనం నమ్మవద్దు. మేక వన్నె పులి మాదిరిగా ఆయన సామాజిక న్యాయం అంటున్నాడని అన్నారు.
ఇటీవల అడ్వయిజరీ పదవులు వీహెచ్ కి, శశిధర్ రెడ్డి కి ఇచ్చారు. కానీ వీహెచ్ కి చాలా తక్కువ జీతం, తక్కువ ర్యాంక్ ఇచ్చారు? కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉండి మేము చిన్ననాటి నుంచి కూడా రాజీవ్ గాంధీ జయంతి నిర్వహిస్తున్న వ్యక్తి వీహెచ్. ఆయనకు తక్కువ జీతం, తక్కువ ర్యాంక్ ఇచ్చారు. శశిధర్ రెడ్డికి మాత్రం రెండున్నర లక్షల జీతం ఇచ్చారు. ఎందుకు వారిద్దరిలో అంత వత్యాసం? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆర్టీఐ కమిషనర్లు ఇస్తే వారిలో ఒక్క బీసీ కూడా లేడు. పైగా ఆర్టీఐ కమిషనర్ భార్యను చిత్రపురి కాలనీ సోసైటీలో మెంబర్ ను చేశారు. చిత్రపురి కాలనీ వాళ్లకు న్యాయం చేస్తానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఊదరగొట్టారు. 52 జడ్జిమెంట్లు ఉన్నా సరే వారికి న్యాయం చేయటం లేదు. సంబంధం లేని వాళ్లకు సోసైటీలో పదవులు ఇచ్చారు. ఎటు పక్క చూసిన సరే అగ్రకులాలకు చెందిన వారికే పదవులు ఇస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది సామాజిక న్యాయం, కానీ చేసేది అటవీక న్యాయం. అడవిలో బలమైన జంతువుదే రాజ్యం. మనం అలా ఉండకూడదని సోసైటీగా ఉండాలని అనుకున్నాం. మాటల్లో కాకుండా చేతల్లో సామాజిక న్యాయం అనేది చేసి చూపాలి. గత రెండేళ్లలో 5 లక్షల 96 వేల కోట్ల బడ్జెట్ పెడితే బీసీల కోసం ఖర్చు చేసింది 5 వేల 5 వందల కోట్లే. అంటే ఒక్క శాతం మాత్రమే బీసీల కోసం ఖర్చు చేశారంటే ఎంత అన్యాయం. బీసీల జనాభా ఎంత? మీరు ఖర్చు చేసింది ఎంత? మహిళలపై కూడా మీకు గౌరవం లేదు. గాంధీ భవన్ లో ఎంతమంది మహిళలు పదవుల కోసం ధర్నా చేశారు? ప్రియాంక గాంధీ పోటీ చేస్తే మీరంతా వెళ్లి గెలిపించుకుంటారు. కానీ మీనాక్షి నటరాజన్ ను మాత్రం ఈ ముఖ్యమంత్రే కుట్ర చేసి ఓడిస్తాడు. ఇదేనా మీరు చెప్పే సామాజిక న్యాయం, మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. యాదగిరి గుట్టలో డిప్యూటీ సీఎం గారిని కింద కూర్చోబెట్టి అవమానించారు. ఎంపీ వంశీ కి కనీసం పుష్కరాల ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. బీసీ బిడ్డలు మంత్రి వాకిటి, కొండా సురేఖలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘోరంగా అవమానించారు. పొంగులేటి కన్నా సీనియర్ అయిన కొండా సురేఖను అవమానించలేదా? లంబాడాలు మినిస్టర్ గా లేని ఏకైక కేబినెట్ మీదేనని ఆరోపించారు.
===========================